Saral Jeevan Bima: రూ.25 లక్షల ఇన్స్యూరెన్స్‌తో త్వరలో స్టాండర్డ్ టర్మ్ లైఫ్ పాలసీ... బెనిఫిట్స్ ఇవే
- Raju Shaik
- Dec 28, 2020
- 2 min read
Saral Jeevan Bima Term Insurance Policy | మీరు టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా? ఏ పాలసీ తీసుకోవాలో అర్థం కావట్లేదా? త్వరలో స్టాండర్డ్ టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీ రానుంది.

టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలనుకునేవారికి శుభవార్త. త్వరలో స్టాండర్డ్ ఇండివిజ్యువల్ టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీ రాబోతోంది. అన్ని లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు ఈ స్టాండర్డ్ టర్మ్ పాలసీని అందించాలని ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా-IRDAI ఆదేశించింది. దీంతో 2021 జనవరి 1 నుంచి లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు 'సరళ్ జీవన్ బీమా' పేరుతో స్టాండర్డ్ టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీని అందిస్తాయి. ఇప్పటికే ఐఆర్‌డీఏఐ సూచనల మేరకు ఆరోగ్య సంజీవని పేరుతో స్టాండర్డ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీని అందిస్తున్నాయి కంపెనీలు. టర్మ్ ఇన్స్యూరెన్స్ విషయంలో కూడా స్టాండర్డ్ పాలసీ ఉండాలని ఐఆర్‌డీఏఐ భావించింది. ఇప్పటికే మార్కెట్లో అనేక టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీలు ఉన్నాయని, వాటిలో కావాల్సిన ప్రొడక్ట్‌ని సెలెక్ట్ చేయడం కస్టమర్లకు సాధ్యం కావట్లేదని, అందుకే స్టాండర్డ్ పాలసీ ఉండాలని ఐఆర్‌డీఏఐ సర్క్యులర్ వెల్లడించింది. డిసెంబర్ 31 లోపు ఈ పాలసీని రూపొందించి తమకు సమర్పించాలని, 2021 జనవరి 1 నుంచే కాకుండా అంతలోపే పాలసీ రూపొందిస్తే ఆమోదం పొంది కస్టమర్లకు అందించొచ్చని ఐఆర్‌డీఏఐ తెలిపింది. స్టాండర్డ్ టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీ అందించాలని ఐఆర్‌డీఏఐ ఇచ్చిన ఆదేశాలపై ఇండస్ట్రీ నిపుణులు సంతోషం వ్యక్తం చేశారు.
ఏ ఇన్స్యూరెన్స్ కంపెనీ నుంచి తీసుకున్నా 'సరళ్ జీవన్ బీమా' పాలసీ నియమనిబంధనలు, బెనిఫిట్స్ ఒకేలా ఉంటాయి. ఇది రిస్క్ ప్రీమియం లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీ. అంటే ఈ పాలసీ తీసుకున్నవారు మరణిస్తేనే నామినీకి పాలసీ డబ్బులు వస్తాయి. ఆత్మహత్య చేసుకొని మరణిస్తే పాలసీ వర్తించదు. కనీసం 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల లోపు వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. పాలసీ గడువు 5 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు ఉంటుంది. పాలసీ మెచ్యూరిటీ గడువు గరిష్టంగా 70 ఏళ్లు. కనీసం రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల సమ్ అష్యూర్డ్‌కు ఈ టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. అయితే ఇంతకన్నా ఎక్కువ మొత్తానికి పాలసీ అందించేందుకు ఇన్స్యూరెన్స్ కంపెనీలకు అనుమతి ఇచ్చింది ఐఆర్‌డీఏఐ. 'సరళ్ జీవన్ బీమా' పాలసీ ప్రీమియం చెల్లించడానికి మూడు ఆప్షన్స్ ఉంటాయి. రెగ్యులర్ ప్రీమియం, లిమిటెడ్ ప్రీమియం, సింగిల్ ప్రీమియం పద్ధతిలో చెల్లించొచ్చు. డెత్ బెనిఫిట్ వార్షిక ప్రీమియానికి 10 రెట్లు లేదా మరణించేనాటికి చెల్లించిన ప్రీమియంలో 1 నుంచి 5 శాతం లేదా సమ్ అష్యూర్డ్ మొత్తం లభిస్తుంది. ఇది టర్మ్ పాలసీ కాబట్టి మెచ్యూరిటీ బెనిఫిట్ ఉండదు. పాలసీ తీసుకున్న 45 రోజుల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ 45 రోజుల్లో కేవలం యాక్సిడెంట్ డెత్ కవర్ మాత్రమే ఉంటుంది. 'సరళ్ జీవన్ బీమా' పాలసీతో పాటు అదనంగా యాక్సిడెంట్ బెనిఫిట్, పర్మనెంట్ డిసేబిలిటీ రైడర్ తీసుకోవచ్చు.
Comments