వాహనదారులకు శుభవార్త.. ఆ డెడ్‌లైన్ మార్చి 31 వరకు పొడిగింపు
- Raju Shaik
- Dec 27, 2020
- 2 min read
వాహనదారులకు కేంద్రం మరోసారి గుడ్ న్యూస్ అందించింది. డ్రైవింగ్ లైసెన్స్, వెహికకల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ రెన్యువల్, ఇతర డాక్యుమెంట్ల రెగ్యులరైజ్ గడువు తేదీని మార్చి 31, 2021 వరకు పొడిగించింది.

మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదా? వాహనం రిజిస్ట్రేషన్ చేసుకోలేదా? ఫిటినెస్ సర్టిఫికెట్ లేదా? కొత్త సంవత్సరం తొలి రోజు (2021 జనవరి 1) నుంచే తిప్పలు తప్పవని టెన్షన్ పడుతున్నారా.. అయితే, మీకు ఇది ఊరట కల్పించే వార్తే. కేంద్ర ప్రభుత్వం మరోసారి ఊరట కల్పించింది. వాహనాల ధ్రువీకరణ పత్రాల క్రమబద్దీకరణ డేట్‌ను మరోసారి పొడిగించింది. 2021 మార్చి 31లోగా క్రమబద్దీకరించుకోవచ్చునని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆదివారం (డిసెంబర్ 27) ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుంటే, కొత్త మోటారు వాహనాలు చట్టం ప్రకారం.. నూతన సంవత్సరం ఆరంభం నుంచే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఇంతకుముందు ప్రకటన చేసింది. అలాంటి వారికి భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది. ఈ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి పోలీసులు కూడా సంసిద్ధమయ్యారు. ఈ తరుణంలో కేంద్రం తాజా ప్రకటన చేసింది.
కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ కారణంగా లైసెన్స్ రెన్యువల్, ఇతర పనులు చేసుకోలేకపోయిన వారికి కేంద్రం మరో అవకాశం ఇచ్చింది. వాస్తవానికి ఈ డెడ్‌లైన్‌ను ఇప్పటికే పలుమార్లు పొడిగించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1తో ముగిసిన గడవును తొలుత మార్చి 30 వరకు, ఆ తర్వాత దశల వారీగా జూన్ 9, ఆగస్టు 24, డిసెంబర్ 31 వరకు పొడిగించింది. తాజాగా ఈ డెడ్‌లైన్‌ను మరోసారి పొడిగించి ఊరట కల్పించారు.
లైసెన్స్ లేకున్నా పోలీసులు పట్టుకోరా?
వాహనదారులకు ఓ సందేహం రావొచ్చు. కేంద్రం గడువును మార్చి 31 వరకు పొడిగించింది కదా.. ఇక డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా, ఇతర పత్రాలు లేకున్నా పోలీసులు పట్టుకోరా? పట్టుకున్నా జరిమానా విధించరా? అనే డౌట్ రావచ్చు. రవాణా శాఖ ఈ అంశంపై స్పష్టత ఇచ్చింది. దీని ప్రకారం..
✧ ఇప్పటివరకు లైసెన్స్ ఉండి, అది ఎక్స్‌పైరీ అయిన వారికి మాత్రమే ఊరట లభిస్తుంది. వెహికల్ ఫిట్‌నెస్ ఇతర పత్రాల విషయంలోనూ ఇదే నియమం వర్తిస్తుంది.
✧ 2020 ఫిబ్రవరి 1తో గడువు ముగిసిన ధ్రువీకరణ పత్రాలన్నింటినీ 2021 మార్చి 31 వరకు చెల్లుబాటు అయినట్లుగానే పరిగణిస్తారు.
✧ ఇక ఇప్పటివరకు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని వారిపై యథావిధిగా చర్యలు తీసుకుంటారు. కొత్త చట్టం ప్రకారం భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంది. ఇతర ముఖ్యమైన పత్రాల విషయంలోనూ ఇదే నిబంధన వర్తిస్తుంది.
కొవిడ్-19 సంక్షోభం కారణంగా డ్రైవింగ్ లైసెన్స్ రెగ్యులరైజ్ చేసుకోలేకపోయిన వారికి మరో అవకాశం ఇచ్చినట్లు కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అలాంటి పౌరులకు సహకరించాలని సూచించింది.
Comments